అనన్య న్యూస్, జడ్చర్ల: రైతులకు 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ అన్నదాతలకు సీఎం కేసీఆర్ సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఖరీదు దారులు, కమిషన్ దారులు, రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరొక సారి జడ్చర్ల అసెంబ్లీ టికెట్ పొందడంపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గత తొమ్మిది ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గమనించాలని కోరారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ ను కూడా అభివృద్ధి చేశామని, వేల మెట్రిక్ టన్నులు నిల్వచేసే గోదాములు నిర్మించామని తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉంటేనే అన్ని పనులు, వ్యాపారాలు బాగా జరుగుతాయని, అందరికీ అన్నం పెట్టే రైతులు బాగుండాలనే సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరపాలని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.