- దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయడంలో డిక్కీది అద్భుతమైన పాత్ర.
- డిక్కీ అవగాహన సదస్సులో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్..
అనన్య న్యూస్, మహబూబ్ నగర్: ఎస్సీ, ఎస్టీలు స్వయంకృషితో ఎదగడగమే కాకుండా పదిమందికి తామే ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదగాలని, ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా మారాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్ లో డిక్కీ (దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు సమగ్ర వ్యాపార నిర్వహణపై అవగాహన సదస్సును మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
డిక్కీ సభకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఇంకా పేదలుగానే ఉండకుండా కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలని, ధనవంతులుగా ఎదిగి శాసించే స్థాయిలో స్థిరపడాలని మంత్రి ఆకాంక్షించారు. వేలాది మంది దళితులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడంలో డిక్కీ పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలను చేయడంలోనూ డిక్కీ ఎంతో కృషి చేస్తున్నదన్నారు. దేశ అభివృద్ధికి పన్నులు చెల్లించే స్థాయికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
డిక్కీ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం, నిధులు:
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డిక్కీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించడంతోపాటు రూ.10 లక్షల నిధులను కూడా అందజేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి డిక్కీ ప్రతినిధులకు తెలిపారు. అడిగిన వెంటనే తమకు స్థలం నిధులు కేటాయించినందుకు మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డిక్కీ రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి అరుణ, రాష్ట్ర కోఆర్డినేటర్లు పరమేష్, అరుణ్ కుమార్, రీజినల్ కోఆర్డినేటర్ వెంకటయ్య, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసులు, సైకాలజిస్ట్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.