- అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
- డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేవరకు పోరాటం ఆగదు: డీకే అరుణ.
అనన్య న్యూస్, మహబూబ్ నగర్: పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించుకుంటారు కానీ మరి పేదవారికి ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి గడియారం చౌరస్తా వరకు జరిగిన నిరసన ర్యాలీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గడియారం చౌరస్తా లో జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇండ్లు నిర్మిస్తే, తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదన్నారు. కేంద్ర వాటా ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి 10 ఎకరాల స్థలం, బిఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాలు, ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు నిర్మించారు, తప్ప పేదలకు మాత్రం ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డుల తప్ప పేదవాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి తొమ్మిదేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు నిరుద్యోగ భృతి హామీ తుంగలో తొక్కారని దుయ్యబడ్డారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారని అన్నారు. రుణమాఫీ అమలు కాక రైతులు మొండి బకాయిలు దారులుగా మారి బ్యాంకుల్లో కొత్త అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో అభివృద్ధి కుంటు పడిందన్నారు. ప్రజలను మోసం చేయడం కోసమే కేసిఆర్ బిఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు.
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ ఇప్పటివరకు నెరవేర్చలేదని, మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలందరికీ తెలిసేలా ప్రతి బిజెపి కార్యకర్త ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.