అనన్య న్యూస్: చాలా రోజుల తర్వాత కండ్లకలక (ఐ ఫ్లూ వైరస్) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల కాలంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని నేత్ర వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, జన సమూహ ప్రాంతాల నుంచి ఈ వైరస్ త్వరితగతిన విస్తరిస్తోంది. కండ్ల కలక వచ్చిన వారి కళ్లలోకి చూడడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుందనే అపోహలు ఉన్న ఇందులో ఎలాంటి నిజం లేదని వైద్యులు అంటున్నారు. వ్యాధికారక సూక్ష్మ జీవులు, వైరస్ సోకిన వ్యక్తి చేతి ద్వారా, లేదా వార్ తాగిన ఏదైనా వస్తువు ద్వారానే వ్యాపిస్తుందని చెబుతున్నారు.
వైరస్ లేదా బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే కళ్ళ కలక ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలర్జీ వల్ల వచ్చే కలక వ్యక్తుల రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అలర్జీ వల్ల సంక్రమించే కళ్ల కలక తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో వచ్చినా, తేలికగానే తగ్గిపోతుంది. బ్యాక్టీరియా వల్ల సంక్రమించే కలక కొన్ని రోజుల వ్యవధిలో పెరిగి కంటిమీద ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో కంటి చూపు దెబ్బతినే అవకాశం లేకపోలేదు అంటున్నారు. కొన్నిసార్లు రసాయనాల వినియోగం వల్ల కూడా కలక రావచ్చంటున్నారు.
కండ్ల కలక లక్షణాలు:
పరిశుభ్రమైన నీటితో కళ్లను కడగటం వల్ల దీనిని తగ్గించుకోవచ్చు. ఒక కన్ను లేక రెండు కళ్లు ఎర్రబడడం, కళ్ళలో మంట, నొప్పి, దురద, కనురెప్పలు వాపు రావడం, కంటి రెప్పలు అతుక్కోవడం, కళ్లలో నుంచి నీరు కారడం కళ్ళకలక లక్షణాలు. కళ్ల కలకకు కారణమైన వైరస్ వల్ల సాధారణ జలుబు, చిన్నపిల్లల్లో జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
జాగ్రత్తలు:
ఈ లక్షణాలు ఉంటే కళ్లను నలపడం, కంట్లో చేతులు పెట్టడం చేయరాదు. శుభ్రమైన టిష్యూ లేదా కర్చీఫ్ వాడాలి. నల్లటి అద్దాలు ధరించాలి. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయట తిరగడం మానాలి. కలక ఉన్న వ్యక్తులు ఉపయోగించిన టవల్స్, కర్చీఫ్, బెడ్ షీట్లు ఇతరులు ఉపయోగించరాదు.