అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మండలం కొండేడు గ్రామం వద్ద దుందుభి వాగులో పడి మంగళవారం ఇద్దరు యువతులు మరణించిన సంఘటన చోటుచేసుకుంది. కొండేడు గ్రామానికి చెందిన పడకండి కేశవులు కూతురు స్వాతి (18), పడకండి మల్లయ్య కూతురు అనూష (18) ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు. దుందుభి వాగు వద్ద నీటి ప్రవాహాన్ని దాటుతూ వారి పొలానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుందుభి వాగులో ఉన్న పాకర వల్ల జారీ నీటి ప్రవాహంలో పడిపోయారు. ఇద్దరూ నీటి ప్రవాహం నుండి బయట పడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తమ పిల్లలు పొలం వద్దకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఒక బండ పైన టవల్, టిఫిన్ బాక్స్ ఉండటం చూసి వెంటనే జరిగిన విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. అందరూ వచ్చి పరిశీలించగా అప్పటికే నీటి ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.