అనన్య న్యూస్, నాగర్ కర్నూల్: జిల్లాలో మాదకద్రవ్యాలు వాడకుండా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎన్సిఓఆర్డి జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ మనోహర్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గుర్తించిన డ్రగ్స్ అడిక్షన్ కేసుల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్, గంజాయి సరఫరా కొరకు వినియోగించే ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, దీని కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న సైకలాజిస్ట్ సేవలు విస్తృతంగావినియోగించు కోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి సిగరెట్లు, 21 వయస్సు లోపు గల వారికి మధ్యం విక్రయించడానికి వీలు లేదని, జిల్లాలో ఉన్న మధ్యం షాపులు, పాన్ డబ్బాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా పెంచాలన్నారు. ఆర్టీసీ నిర్వహించే కార్గో ద్వారా ఎగుమతులు, దిగుమతులపై పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను పరిశీలించాలని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న మెడికల్ షాపులలో హెచ్ డ్రగ్స్ అమ్మకాలు డిజిటల్ విధానం ద్వారా మాత్రమే జరిగేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో అవసరమైన ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం, జువెనైల్ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి సరఫరా చేసే ఎవరిని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లాలో గంజాయి సాగు చేసే వారిని గుర్తించి అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మాదక ద్రవ్యాలు వ్యసనం ఉన్న వారిని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. మాదక ద్రవ్యాలైన గంజాయి వాడేవారు వారి ద్వారా సరఫరా చేసే వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని, ఎక్సైజ్, పోలీస్ శాఖలు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. గంజాయి హాట్ స్పాట్లను, వాడుతున్న వారిని, సరఫరా చేస్తున్న వారి సమాచారాన్ని ప్రజలు సమీప పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు తెలపాలని ఎస్పీ కోరారు.
సమావేశంలో జిల్లా క్రైమ్ డిఎస్పి సత్యనారాయణ, డి.ఎం.హెచ్.ఓ. సుధాకర్, డిపిఓ కృష్ణ, డి.ఈ.ఓ గోవిందరాజులు, నాగర్ కర్నూల్ డీఎస్పీ మోహన్ కుమార్ కల్వకుర్తి డి.ఎస్.పి నరసింహ అచ్చంపేట డి.ఎస్.పి కృష్ణలు మున్సిపల్ కమిషనర్, ఆర్టీసీ ఆర్ఎంఓ చందు నాయక్, నాగర్ కర్నూల్ డిఎంఓ, పోలీసు, ఇతర సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.