అనన్య న్యూస్, మిడ్జిల్: వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో కరిగేట నారుమడి దున్నుతుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సోమవారం మిడ్జిల్ మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు ఉషయ్య గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడని, ఈ క్రమంలోనే తన పొలంలో నారుమడి కరిగేట దున్నడానికి తన ట్రాక్టర్ కు కేజీ వీల్స్ బిగించుకొని నారుమడి దున్నుతుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఉషయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అటుగా వెళుతున్న తోటి రైతులు విషయాన్ని గమనించి ఉషయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుని ఉషయ్య మృత దేహాన్ని ట్రాక్టర్ నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న మిడ్జిల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Mbnr: కరిగేట చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి..
RELATED ARTICLES