రూ.2 లక్షలతో నా బిడ్డను చదివిస్తా..
అనన్య న్యూస్, జడ్చర్ల: సాయం చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటానని గొల్లపల్లి గ్రామానికి చెందిన చిట్టెమ్మ అన్నారు. జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నరసింహులు కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నరసింహులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావడంతో సభ్యత్వ నమోదు పొంది ఉండడం వల్ల పార్టీ నుంచి 2 లక్షల రూపాయల పార్టీ ప్రమాద బీమా మంజూరు అయింది. ఈ మేరకు మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నరసింహులు భార్య చిట్టెమ్మకు 2 లక్షల రూపాయల పార్టీ ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా చిట్టెమ్మ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అందించిన 2 లక్షలతో తన కొడుకును చదివించుకుంటానని, ఆపదలో ఉన్న మాకు సీఎం కేసీఆర్ నేనున్నానంటూ పార్టీ ప్రమాద బీమాతో భరోసా కల్పించారని, సాయం చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటానని, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.