అనన్య న్యూస్, జడ్చర్ల: 2014 తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రాజాపూర్ మండల కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమల్లో పాల్గొన్నారు. మొదటగా లారీ అసోసియేషన్ వెల్డింగ్ కార్మికుల భవన నిర్మాణానికి, శాలివాహన సంఘం భవనం, రాజాపూర్ మండల ముదిరాజ్ సంఘం భవనం, మున్నూరు కాపు సంఘ, రాజాపూర్ మండల బుడగ జంగాల సంఘo, నాయి బ్రాహ్మణ సంఘం బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం మటన్ మార్కెట్, గ్రామంలోని పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని కుల మత సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. స్వరాష్ట్రంలో ప్రతి గ్రామానికి, మండలానికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో, ఏఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో ప్రజలు గమనించాలన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని, ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి సాధ్యంకానీ హామీలు ఇచ్చే నాయకులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.