అనన్య న్యూస్, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయూత పేరుతో వృద్ధులు, వితంతులకు రూ.4 వేలు ఫించన్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పోడు భూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక, బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జన గర్జన సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖమ్మం వేదికగా ఎన్నికల హామీలు ప్రకటించారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత్ జోడోయాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని, దేశాన్ని ఏకం చేసేందుకు జోడో యాత్ర చేశానని, ప్రజల్లో విద్వేషం తొలగించే ప్రయత్నం చేశా చేశానని అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించింది. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు. బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్వాగతిస్తున్నా, పొంగులేటి పులిలా పోరాడుతున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా, మీ మనసుల్లో మీ రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న భట్టి విక్రమార్కకు అభినందనలు అని రాహుల్ గాంధీ తెలిపారు.
ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను సీఎం కెసిఆర్ లాక్కున్నారు. టిఆర్ఎస్ ఏకంగా తన పార్టీ పేరే మార్చుకుంది. బిఆర్ఎస్ అంటే బిజెపి బంధువుల పార్టీ అని విమర్శించారు. సీఎం కెసిఆర్ తెలంగాణకు రాజులా భావిస్తున్నారని, ఈ భూములు కెసిఆర్ వి కావు ఈ భూములు మీవి అని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యలు తెలుసుకున్నానని మరో ఆరు నెలలో తెలంగాణలో పరిస్థితి మారబోతుందన్నారు.