అనన్య న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని, ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అంటున్నారని పార్టీ బలంమేమిటో కార్యకర్తలు చూపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో బిజెపి నిర్వహించిన జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు భరోసా ఇచ్చేందుకే ఈనెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా ఖమ్మం వస్తున్నట్లు ప్రకటించారు. ఆరోజు అమిత్ షా తో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, సభను సక్సెస్ చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నియోజక వర్గాలలో బహిరంగ సభలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం తరువాత 20వ తేదీన నాగర్ కర్నూల్ లో జరిగే మీటింగ్ కు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని తెలిపారు. అంతే కాకుండా త్వరలోనే ప్రధాని మోదీని సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు, ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. ఖమ్మంలో బీజేపీ చేసిన ఉద్యమం జిల్లా ప్రజలు మర్చిపోరు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో పర్యటించాలంటే.. బీజేపీ నాయకులను ముందుగా గృహ నిర్భందం చేస్తున్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా రెండు సార్లు జైలుకు వెళ్లా.. ఎంతో మంది కార్యకర్తలు జైలుకి వెళ్లారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ బీజేపీ. కటుంబ పాలన అంతం చేయాలంటే బీజేపీ ఇవాళ రాష్ట్రంలో అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.