అనన్య న్యూస్, ఢిల్లీ: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 ఖరీఫ్ సీజన్ కు గాను పలు రకాల పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. క్వింటాల్ సాధారణ వరికి మద్దతు ధరను రూ.143 చొప్పున పెంచినట్టు వెల్లడించారు. దీంతో క్వింటాల్ సాధారణ వరి రకం ధర రూ.2,189కి చేరింది. అలాగే, గ్రేడ్ -ఎ వరికి రూ.163లు పెంచడంతో క్వింటాల్ ధర రూ.2203కి పెరిగిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధర అధికంగా పెంచినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఎంఎస్పీ పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
పెసర పంట కు భారీగా పెంపు:
పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచారు. గతేడాది క్వింటాల్ ధర రూ.7,755లు ఉండగా… ఈసారి 10.4శాతం పెంచడంతో పెసరకు మద్దతు ధర రూ.8,558కి పెరిగింది. అలాగే, హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3180, జొన్న(మాల్దండి), రూ.3225, రాగి రూ.3846, సజ్జలు రూ. 2500, మొక్కజొన్న రూ.2090, పొద్దుతిరుగుడు (విత్తనాలు) రూ.6760, వేరుశెనగ రూ. 6377, సోయాబీన్ (పసుపు పచ్చ) రూ.4600, పత్తి(మధ్యస్థాయి పింజ) రూ.6620, పత్తి (పొడవు పింజ) రూ. 7020చొప్పున ఈ సీజన్ లో ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది.