- ధరణి పోర్టల్ కాదు వాళ్ళనే బంగాళాఖాతంలో కలపాలి.
అనన్య న్యూస్: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా నిర్మల్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నాం. కలెక్టరేట్‌ను ప్రారంభించాం సంతోషంగా ఉంది. నిర్మల్ జిల్లాలో 396 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు కూడా ప్రత్యేకంగా రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నాం. అదే విధంగా నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున ప్రకటిస్తున్నాం. ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల విడుదలై పదో తరగతి ఫలితాల్లో తెలంగాణలోనే నిర్మల్ జిల్లా నంబర్ వన్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తానని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ధరణి పోర్డల్ ను బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. వాళ్లనే బంగాళాఖాతంలో వేయాలే. మహారాష్ట్రలో బ్యాంకులో అమౌంట్ పడితే ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ దుర్మార్గులు 50 ఏళ్ల పాలనలో నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఒకప్పడు కరెంట్ అంటే రైతులు భయపడే పరిస్థితి ఉండే. వీళ్లు వస్తే మళ్లీ అదే పరిస్థితి వస్తుంది. రైతు బంధుకు, దళితబంధుకు రాం రాం అంటారు. మనం రావాలా వాళ్లు రావాల్నా మీరే ఆలోచన చేయలే. ప్రతిపక్ష నాయకులు అధికారం కోసం ఆగం చేస్తున్నారు. అధికారం లేనందున ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.