అనన్య న్యూస్, జడ్చర్ల: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్‌మెయిలర్ అని, మహబూబ్ నగర్ జిల్లా విలువను తగ్గిస్తున్నది రేవంత్ రెడ్డి అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. జడ్చర్లలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని శనివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి నిర్మించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, ఆస్పత్రిలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. డయాలసిస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల అద్దంలా మెరిసిపోతుందని అన్నారు. ఈ అభివృద్ధిని చూసి కొంతమంది మూర్ఖులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా విలువను తగ్గిస్తున్నది రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రేవంత్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాల్లేనని అన్నారు. రాజకీయాలను ఆయన భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. అసలు మిడ్జిల్‌కు ఏం చేశాడో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. బీజేపీ నాయకులు మత కల్లోలాలు రేపి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని తర్వాత కాలేదని అన్నారు. అదే విషయాన్ని ఒక సామాన్య వ్యక్తితో జడ్చర్ల అభివృద్ధి ఎప్పుడు జరిగిందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సవాలు విసిరారు. ప్రజలు పనిచేసే వారిని గుర్తించి ఆదరించాలన్నారు.