అనన్య న్యూస్, హన్మకొండ: వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. దాడి చేసి మరో బాలుడుని చంపేశాయి. ఈ ఘటన హన్మకొండ జిల్లా కాజీపేటలో జరిగింది. వీధిలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు చోటూపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో చోటూ తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటినిండా రక్తపు గాయాలతో పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చోటూ చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు బాలుడి తల్లిదండ్రులు.
చిన్నారి చోటూ కుటుంబం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ రాష్ట్రంలోనే జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం కాజీపేట రైల్వేపార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు.