- ఏటా మే రెండో ఆదివారం మాతృ దినోత్సవం.
- అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- అనన్య న్యూస్ ప్రత్యేక కథనం..
అనన్య న్యూస్: ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడని చెబుతారు పెద్దలు. అమ్మంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికైనా అమ్మే తొలిగురువు. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తోంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకుని కరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. ప్రపంచంలో అతి పేద వాడు అంటే ధనం లేని వాడు కాదు అమ్మ లేని వాడు. అమ్మ ప్రేమ దక్కిన వాడు అత్యంత కోటీశ్వరుడు. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు మారుపేరైన తల్లి ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ పట్ల మనకు ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి తరుణం ఇంకొకటి ఉండదు. అందుకే ఏటా మే రెండో ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
కనిపించే దైవం అమ్మ:
కనిపించే దైవం అమ్మ అందుకే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు పెద్దలు పిల్లలు అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా, అంగవైకల్యం కలిగి ఉన్నా గుండెలకు హత్తుకుంటుంది తల్లి. తన సంతానాన్ని కండ్లల్లో పెట్టుకొని చూసుకుంటుంది అమ్మ. అందుకే ఏనుగంతటి తండ్రి ఉన్నా అమ్మలేని జీవితం అంధకారమే అంటారు పెద్దలు. అమ్మ చేతి ముద్ద అమృతంగా ఉంటదంటారు. ఎందుకంటే ప్రేమ, అప్యాయత రంగరించి గోరు ముద్దలు తినిపిస్తుంది కాబట్టి అందుకే అమ్మ అంటే అందరికీ అనురాగం, ఆప్యాయత. మన పెద్దలు మాతృ దేవోభవ పితృ దేవోభవ అంటూ అమ్మకే అగ్ర తాంబూలం ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు మారుతాయేమో కానీ, అమ్మ ప్రేమ మారదు. ఎంత ఎదిగి దూర తీరాలకు వెళ్లిన ఆ తల్లి హృదయం బిడ్డల క్షేమం కోసం పరితపిస్తూ నే ఉంటుంది. కన్నపేగు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ బిడ్డల కోసం సర్వస్వాన్ని ధారపోసి పెంచి పెద్ద చేసిన తల్లులు వారి జీవిత చరమాంకంలో కళ్ళల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం.
మాతృ దినోత్సవం ఏర్పడింది ఇలా:
ఏటా మే రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్‌లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్ గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృ దినోత్సవం (మదర్స్ డే) కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది. ఫలితంగా 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమె రికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..