అనన్య న్యూస్, నాగర్‌కర్నూల్ : పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొల్లాపూర్ మండల పరిధిలోని నార్లపూర్ రిజర్వాయర్ పనులను సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ రాములు, కలెక్టర్ ఉదయ్, ఈఎన్సీ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలిసారిగా పాలమూరు ఎత్తిపోతల పనులపై సమీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. 2014లో తొలి కేబినెట్‌లో కూడా పాలమూరు ఎత్తిపోతల చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే 22 నియోజకవర్గాలకు సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. కొంత మంది నాయకులు కావాలనే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. కృష్ణా నది జలాల్లో కేంద్రం తెలంగాణ వాటా తేల్చకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. అయితే తెలంగాణ వాటాకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రెండున్నర నెలల్లో పనులను పూర్తి చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వట్టెం రిజర్వాయర్ ను పరిశీలించారు. ఇక్కడ దాదాపు 90 శాతం పనులు పూర్తి అయ్యాయని మిగిలిన 10 శాతం పనులను గరిష్టంగా మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్యాకేజ్ నెంబర్ 12 దగ్గర మిషన్ భగీరథ కెనాల్ ను పరిశీలించారు. కెనాల్ కు హైడ్రాలిక్ గేట్ ల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు