- నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- కొత్త సచివాలయంలో కొలువుదీరిన మంత్రులు.
అనన్య న్యూస్, హైదరాబాద్: నూతనంగా ప్రారంభమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 6వ అంతస్తులోని తన ఛాంబర్‌లో ఆదివారం సీఎం కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కీలక దస్త్రంపై కేసీఆర్ సంతకం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై సీఎం కేసీఆర్ మొదటి సంతకం చేసి, ఆ ఉద్యోగుల్లో సంతోషం నింపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు మేయిన్ గేట్ వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వెళ్లిన సీఎం కేసీఆర్ యాగశాలను సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని ప్రారంభించారు.
సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం మంత్రులు తమ చాంబర్ లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్ పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయగా, మంత్రి హరీశ్ రావు రెండు దస్త్రాలపై సంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.