అనన్య న్యూస్, మహబూబ్ నగర్: ధరణితోపాటు ఇతర సమస్యల పరిష్కారానికై వచ్చే ఏ దరఖాస్తులైన నెలకు మించి పెండింగ్ లో ఉంచుకోవద్దని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు. గురువారం తహసిల్దార్ లతో వెబ్ ఎక్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి దరఖాస్తుల పరిష్కారం బాగుందని అన్నారు. ప్రజావాణిలో భూములకు సంబంధించి వచ్చే దరఖాస్తుల సంఖ్య సైతం తగ్గిందని, దీనిని కొనసాగించాలని ఆయన కోరారు. జిఎల్ఎంలో 197 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని అదేవిధంగా సక్సెసన్ దరఖాస్తులు 79 ఉన్నాయని, ముందుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించి వాటిని పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ నెల పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ మ్యుటేషన్ లకు సంబంధించి 100 శాతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే పరిష్కరించాల్సిందిగా తహసిల్దార్ లను ఆదేశించారు. పట్టా డేటా కలెక్షన్లు పై కలెక్టర్ సమీక్షిస్తూ త్వరితగతిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎన్నికల అంశానికి సంబంధించి బిఎల్ఓ లాగిన్ పై దృష్టి సారించాలని, ఓటర్ జాబితాలో ఇంకా పరిశీలించని దరఖాస్తులు, ఎన్నికల సంఘం ఆదేశం మేరకు సమర్పించాల్సిన రిపోర్ట్లు తక్షణమే పంపించాల్సిందిగా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కమిషన్ ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఈ- ఆఫీసులో క్లోజ్ చేయాల్సిన ఫైళ్లను తక్షణమే చేయాలని, గతవారం 6825 ఉండగా 150 క్లోజ్ చేయడం జరిగిందని, ఇంకా క్లోజ్ చేసేందుకు ఆస్కారం ఉన్న ఫైళ్ళను కలెక్టరేట్ స్థాయిలో చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తహసిల్దార్ల స్థాయిలో 668 పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లోజ్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. పట్టణ ప్రాంత గృహ నిర్మాణ లబ్ధిదారుల అప్లోడింగ్ పై సైతం మిగిలిపోయిన 443 లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో 29 దరఖాస్తులు, ఎఫ్ లైన్ పిటిషన్లు 65 పెండింగ్లో ఉన్నాయని, సర్వేయర్లను తక్షణమే వీటిపై దృష్టి సారించి ఉదయము, సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున సర్వే చేయించేందుకు కృషి చేయాల్సిందిగా తెలిపారు. సర్టిఫికెట్ల జారీ ఎప్పటికప్పుడు సర్టిఫికెట్లను జారీచేయాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు సంబంధించి తహసిల్దారుల స్థాయిలో 131 పెండింగ్ ఉండగా సంబంధిత శాసనసభ్యుల అనుమతి కోసం 340 పెండింగ్ ఉన్నాయని, 1013 దరఖాస్తులు అన్ని అనుమతులు పొంది శాంక్షన్ కోసం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామరావు, ఆర్డిఓ అనిల్ కుమార్, ల్యాండ్ రికార్డ్స్ ఏడి కిషన్ రావు, మైన్స్ ఏడి విజయకుమార్, కలెక్టర్ కార్యాలయ ఏవో శంకర్, జిల్లా ఇన్ఫర్మేషన్ అధికారి ఎంవివిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.