Saturday, March 15, 2025

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ సమావేశం.. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్‌..

అనన్య న్యూస్, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలిపారు. దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్‌ఎస్‌ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ భారతదేశాన్ని75 ఏండ్ల పరిపక్వ ప్రజాస్వామ్య దేశంగా ఘనంగా చెప్పుకుంటున్నాం, నేటికీ దేశ ప్రజలు తాగు, సాగునీరు, విద్యుత్‌ అందక అల్లాడిపోతున్నారు. మౌలిక వసతుల కొరతతో దేశ ప్రగతి మందగిస్తున్నది. దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలవాల్సిన యువతకుఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజంలో నేటికీ కుల, మత, లింగ వివక్షలు కొనసాగడం విషాదం. ఈ వివక్షల వల్ల భారత సమాజం వికాసం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దేశంలో సామాజిక సమానత్వం కొరవడింది. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉపాధి లేక మగ్గిపోతున్నారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ హక్కులు, రక్షణ కల్పించినప్పటికీ.. ఇప్పటికీ దళిత, మైనార్టీలపై జరుగుతున్న దాడులు నాగరికతా విలువలను పరిహసిస్తున్నాయి.

భారతదేశంలో ఎంతో అద్భుతమైన వనరులు ఉన్నాయి. పాలకుల వైఫల్యంతో ప్రజల దుర్భర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. దేశంలో నీటి వనరుల లభ్యత దేశ ప్రజల అవసరాలకు మించిన స్థాయిలో ఉంది. ఏటా దాదాపు 4 వేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల వర్షం కురుస్తున్నది. 70 వేల టీఎంసీల నీరు నదుల్లో ప్రవహిస్తున్నది. దేశవ్యాప్తంగా కేవలం 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకున్నాం. మిగతా 50 వేల టీఎంల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నాయి. ఇందులో నుంచి మరో 20 వేల టీఎంసీల నీటిని వినియోగించుకుంటే దేశంలో సాగుయోగ్యమైన 41 కోట్ల ఎకరాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించవచ్చు. ఇవన్నీ స్వయంగా కేంద్రం వెల్లడించిన గణాంకాలు. 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే.. దేశ పాలకులు తమాషా చూస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా తాగు, సాగునీటి కటకటే.

భారత్‌ కన్నా విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ చాలా చిన్న దేశాలు పెద్దపెద్ద రిజర్వాయర్లు నిర్మించుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ జింబాబ్వేలో ఉంది. పాలకులు ఇటువంటి చర్యలు చేపట్టకపోవడంతో అనేకమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ మినహా.. దేశంలోని అన్నిప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగునీరు లేక బాధలు అనుభవిస్తున్నారు. దేశంలో అనేక పట్టణాలు, నగరాల్లో వారం రోజులకోసారి తాగునీరు రావడం లేదు. పల్లెల్లో మహిళలు మైళ్ల దూరం నడిచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. కడివెడు నీళ్ల కోసం వీధిపోరాటాలకు దిగాల్సి వస్తుందని కేటీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.

తీర్మానాలు:

  • దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బిఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం.
  • దేశానికి సాగునీటి విధానం రూపొందించాలి.
  • వ్యవసాయానికి పెట్టుబడి సాయం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని.
  • భారత ప్రజలను ఏకం చేసి బలీయమైన రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ ముందుకు వెళ్లాలని.
  • బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు సమగ్ర సాగునీటి విధానం రూపొందించాలని.
  • తెలంగాణలో వున్న రైతు రాజ్యం దేశం అంతటా స్థాపించాలని, ఇందుకోసం అలుపెరుగని పోరాటం దిశగా బిఆర్ఎస్ ముందుకు వెళ్ళాలని.
  • కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించాలని.
  • నూతన విద్యుత్ విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకురావాలని.
  • దళిత బంధు పధకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని.
  • దేశంలో మౌళిక వసతుల కల్పన చేయాలని.
  • కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని.
  • మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో తీర్మానాలు చేశారు.
Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular