అనన్య న్యూస్, మహబూబ్‌నగర్: పాలమూరులో నూతనంగా నిర్మించిన ఐటీ పార్కులో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దివిటిపల్లి ఐటీ కారిడార్‌లో అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ వారి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను కలెక్టర్ రవినాయక్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావుతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు ఇక్కడకు రాబోతున్నాయని తెలిపారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే ఇక్కడకొచ్చి వారి కార్యకలాపాలను సిద్ధం చేసుకుంటామని చెప్పారన్నారు. దేశ విదేశాల్లో ఉండి పనిచేస్తున్న పాలమూరుకు చెందిన వాళ్లు ఇక్కడ ఉద్యోగాలు చేసేలా ఐటీ టవర్‌ను తీర్చిదిద్దుతామని వివరించారు. స్థానిక యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి మంచి ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
ఐటీ కంపెనీ కోసం సుమారు 400 ఎకరాల భూమిని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సేకరించామని తెలిపారు. మే 6వ తేదీన మంత్రి కేటీఆర్ పాలమూరు సమీపంలోని దివిటిపల్లి ఐటీ టవర్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని టీఎస్‌ఐఐసీ అధికారులను ఆదేశించారు. కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు విశాలమైన స్థలాన్ని ఆయా కంపెనీలకు అందించాలని కోరారు. వచ్చే మూడేండ్లలో కనీసం 30 వేల ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.