అనన్య న్యూస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వెస్ట్ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50 గంటల ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో భారత విద్యార్థి ఏలూరు జిల్లా వాసి సాయిష్ వీర (24) ప్రాణాలు కోల్పోయాడు. ఓహియో రాష్ట్ర రాజధాని నగరం కొలంబస్ ప్రాంతంలో ఫ్రాంక్లిన్‌టన్ గ్యాస్ స్టేషన్ వెనక ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇద్దరు ఆగంతకులు ఫుడ్‌కోర్టులోకి చొరబడి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సాయిష్ వీరాను వెంటనే ఓహియో హెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్ పరిధిలోని1000 వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్ లో వీర క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.
కొలంబస్ పోలీసులు అనుమానితుడి ఫొటోలను విడుదల చేశారు. 2023లో కొలంబస్‌లో ఇది 50వ హత్యగా ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. సాయిష్ వీర మరో రెండు వారాల్లో ఉద్యోగం మానేయాలనుకున్నాడట. ఇంతలోనే ఈ ఊహించని ఘోరం జరిగిపోయింది. ఈ ఘటన అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిష్ వీరా.. కొలంబస్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. హెచ్-1బీ వీసా కూడా తీసుకున్నాడు. అందరితో కలివిడిగా ఉండేవాడని, ఏ సాయం అడిగిన కాదనకుండా హెల్ప్ చేసే వాడని అలాంటి మంచి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని అతని స్నేహితులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.