అనన్య న్యూస్, నాగర్ కర్నూల్: పాలమూరు ఎత్తిపోతల పనులు త్వరలో పూర్తికానున్నాయని, వీటి ద్వారా రైతులకు సాగునీరందించి దశాబ్దాల నాటి కలను నెరవేర్చనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెల్కపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఒక్క ఎకరాకు కృష్ణమ్మ నీళ్లు రాని ప్రాంతంలో ఎన్నో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. శరవేగంతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి కల్వకుర్తి ఎత్తిపోతలకు 40 టీఎంసీలు నీటిని కేటాయించిందని అన్నారు.1984 నుంచి 2014 వరకు గత పాలకుల హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల పనులను సాగదీశారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హరీశ్‌రావు సాగునీటి శాఖా మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా తాను ప్రాజెక్టు పనులను పరిశీలించి సాగునీళ్లు పారించామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలు సాగుఅవుతాయని వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతదితరులు పాల్గొన్నారు.