అనన్య న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆసుపత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో బయట నుంచి రెండో అంతస్థు లిప్ట్ వరకు రోగి బంధువులే అతని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నా అక్కడి వైద్య సిబ్బంది కూడా పట్టించుకోలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత నెల మార్చి 31న ఈ సంఘటన చోటు చేసుకోగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోజుకు సగుటున 1500 మంది ఓపీలకు వైద్యం అందిస్తుండగా, ఎమర్జెన్సీలో కేవలం 15 స్ట్రెచర్స్ ఉన్నాయని రోగులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రులలో సరైన సౌకర్యాలు లేక రోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తోందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు.