అనన్య న్యూస్, సిద్దిపేట: తాగునీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు కేంద్రం ప్రోత్సహకాలు ఇవ్వకుండా పక్షపాతం చూపడం లేదా..? మిషన్ భగీరథకు రూ.13 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా 13 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా? అని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ట్రయల్ రన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ పథకాలు అద్భుతమని తియ్యటి మాటలు చెబుతారు. అవార్డు ఇస్తారు కానీ నయా పైసా ఇవ్వరని మండిపడ్డారు. మిషన్ భగీరథ స్కీంను మోదీ గజ్వేల్‌లో ప్రారంభించి, అభినందించలేదా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ నుంచి ఆరు జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లోని 1922 గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి కూడా మేలు జరగబోతుందన్నారు. ఇప్పటి వరకు 300 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుండగా, ఇప్పుడు మరో 300 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు అవకాశం ఏర్పడింది. భవిష్యత్‌లో పెరిగే హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ పది నియోజకవర్గాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా అవుతుందన్నారు. భవిష్యత్ 50 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.