- అలరించిన విద్యార్థుల రామకథా గానం
అనన్య న్యూస్, జడ్చర్ల: శ్రీరామ నవమి వేడుక గురువారం పురస్కరించుకొని శ్రీరామ నవమి వేడుకలను జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అక్షర కాన్సెప్ట్ పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షర కాన్సెప్ట్ పాఠశాల చిన్నారులు శ్రీరామ, సీత, లక్ష్మణ, హనుమంతుని వేషధారణలతో అలరించారు. ముఖ్యంగా లవకుశ వేషధారణతో విద్యార్థులు తమ చక్కటి హావభావాలను ప్రదర్శిస్తూ రామకథా గానం చేశారు. విద్యార్థులు తమ రామకథా గానంతో మంత్ర ముగ్ధుల్ని చేశారు. రామాయణంలోని ఘట్టాలను రాముని బాల్యం మొదలుకొని పట్టాభిషేకం వరకు అన్ని అంశాలను చక్కగా విద్యార్థులు వివరించారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు స్వయంగా వేసిన శ్రీ రామ నవమి విశిష్టతను తెలిపే శ్రీరామ ఘట్టాల చిత్ర పాటలు, శ్రీ సీతారాముల వివాహ ఆహ్వాన పత్రిక ప్రదర్శన కనువిందు చేసింది. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు పడాల రేణుక, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.