అనన్య న్యూస్, నారాయణపేట: స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన బ్యాంకర్ల జిల్లా స్థాయి, సమన్వయ సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న వివిధ పథకాలను పొందడానికి దరఖాస్తు చేసుకునే ఔత్సాహికులకను నిరుత్సాహ పరచకుండా రుణాలు అందించేందుకు బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 275 దరఖాస్తులు వివిధ బ్యాంకులకు ఋణాలకై పంపించగా ఇప్పటి వరకు కేవలం 34 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే లబ్దిదారులతో లేదా సంబంధత శాఖ అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం మేరకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన వారందరికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, జీవన్ సురక్ష బీమా చేయించాలని తద్వారా ఖాతాదారులకు మేలు చేసిన వారం అవుతామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బునీడు, గుండుమాల్ లలో కొత్తగా బ్యాంక్ బ్రాంచ్ లు పెట్టేందుకు ఆదేశించారు. అదేవిధంగా మద్దూర్, కోస్గి, నారాయణపేట, మరికల్ లో ఏ.టి.యం లు ఏర్పాటు చెయాల్సిందిగా లీడ్ బ్యాంక్ మెనేజర్ ను ఆదేశించారు.
2022-23, 3వ త్రైమాసికం వరకు జిల్లాలో 58.69 శాతం రుణాలు మంజూరు చేసినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. ఇందులో గృహ రుణాలు అత్యధికంగా 81.64 శాతం గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. ఆర్థికంగా ఎలా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి నెల 3వ శుక్రవారం అన్ని బ్యాంక్ బ్రాంచిలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఆదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, నాబార్డ్ డిడియం షణ్ముఖ చారి, ఆర్.బి.ఐ. ఎల్డిఓ తేజ దీప్త బెహేర, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్, ఇతర బ్యాంక్ రీజినల్ మేనేజర్లు, బ్యాంక్ మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.