- ఎల్బీనగర్ చౌరస్తాకు ఉద్యమకారుడు శ్రీకాంతాచారి పేరు
అనన్య న్యూస్, హైదరాబాద్: ఇప్పటివరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు అన్ని పూర్తయ్యాయని, కేవలం మూడు మాత్రమే చివరి దశలో ఉన్నాయని అవి కూడా సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఈ పనులు పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్‌బీ నగర్ చౌరస్తాకు పెడతామని ప్రకటించారు. శనివారం ఎల్బీనగర్ లో నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ప్రారంభించుకున్న ఫ్లైఓవర్‌కు మాల్ మైసమ్మ అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఎల్‌బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎస్ఆర్‌డీపీ కింద ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో మొత్తం 12 పనులను రూ. 650 కోట్లతో చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ 9వ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయనీ, బైరామల్‌గూడలో సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, రెండు లూప్‌లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి, పనులు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాంమని కేటీఆర్ స్పష్టం చేశారు.
నాగోల్ నుంచి ఎల్‌బీ నగర్‌కు మెట్రో:
ఎల్బీనగర్ చౌరస్తా దాటాలంటే గతంలో 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఈ ఫ్లై ఓవర్లు మాత్రమే కాదు.. ప్రజా రవాణా మెరుగుపడల్సిన అవసరం ఉంది. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. తప్పకుండా నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు మెట్రోను తీసుకువస్తాం. హయత్‌నగర్‌కు కూడా విస్తరిస్తాం. ఎయిర్‌పోర్టు వరకు కూడా మెట్రోను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. గడ్డి అన్నారం మార్కెట్‌లో వెయ్యి పడకల టిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే సంవత్సరన్నర కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. జీవో నంబర్ 118 కింద దశబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి చొరవతో పరిష్కరించుకున్నాం. ఈ నెలఖారు వరకు పట్టాలు అందించి, ఆ బాధ నుంచి విముక్తి చేస్తాం. మిగిలిన కాలనీల వారికి కూడా న్యాయం చేస్తాంమని స్పష్టం చేశారు.