అనన్య న్యూస్, ఖమ్మం: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను గురువారం పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని అన్నారు. గంటలో ఈ నిధులను విడుదల చేస్తామని తెలిపారు.
రైతులకు అండగా ఉంటాం:
గాలివాన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థిక వేత్తలు కూడా ఉన్నారు. కానీ మేం గర్వంగా చెబుతున్నాం.. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉంది. జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉంది. యావరేజ్‌గా 16 శాతం వరకు ఉంది. అని సీఎం కేసీఆర్ తెలిపారు. అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని.. ఇది మనకు చాలా గర్వకారణమని అన్నారు. రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలిపారు. ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలని తెలిపారు.
ఎకరానికి 10వేలు అందజేస్తాం:
తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు, వాటర్ సెస్ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. ఆ స్థితిని దెబ్బతీయ నివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. తెల్వక దీన్ని చాలామంది నష్టపరిహారం అని అంటారు. కానీ వీటిని సహాయ పునరావాస చర్యలు అని పిలవాలి. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరు. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి 10వేలు ప్రకటిస్తున్నా. వెంటనే వీటిని అందజేస్తాం. స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. ఈ డబ్బును నేరుగా రైతులకు ఇవ్వకుండా.. ప్రతి రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి ఆదుకునేలా ఆదేశాలిస్తాం. పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాం. జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా.. రబ్బర్ బంతి తిరిగొచ్చినట్లుగా.. భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలి. ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొదని రైతుల్లో భరోసా కల్పించారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.