బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇంట్లోకి దుండగలు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని షారుఖ్ నివాసం మన్నత్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు అక్రమంగా చొరబడ్డారు. అయితే వారిని గుర్తించిన భద్రతా సిబ్బంది దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో వారు గుజరాత్‌కి చెందిన వ్యక్తులని తేలింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రహరీ గోడను దూకిన ఇద్దరు యువకులు మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అప్రమత్తం అయిన భద్రతా సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో 20- 22 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆ యువకులు తాము గుజరాత్ నుంచి వచ్చామని, షారుఖ్ ఖాన్ అంటే చాలా అభిమానమని, తమకు ఇష్టమైన నటుడిని దగ్గర చూడటానికే అలా చేసినట్లు పోలీసులకి తెలిపారు.
అయితేవారిపై ఐపీసీ ప్రకారం అతిక్రమణ, మరి కొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వారికి ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా సుమారు నాలుగేళ్ల తర్వాత పఠాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. కండలవీరుడు జాన్ అబ్రహం విలన్‌గా కనిపించాడు.