అనన్య న్యూస్, హైదరాబాద్: విశాఖ ఉక్కుపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, అదేశాఖ డైరెక్టర్, టీఎస్‌ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్, సింగరేణి సంస్థ నుంచి సీనియర్ అధికారితో కూడిన బృందం సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు రెండు రోజుల పాటు సింగరేణి అధికారులు విశాఖ ఉక్కు పరిశ్రమను అధికారులతో సమావేశమై బిడ్ విషయంపై చర్చించనున్నారు. ప్రభుత్వ పరంగా బిడ్‌లో పాల్గొంటూనే విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆసక్తి వ్యక్తీకరణ ప్రతి పాదనల కోసం విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికా రుల ఎంపిక చేసిన అధికారుల బృందానికి సీఎం ఆదేశించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సేకరించాలనుకుంటున్న నిధులెన్ని, తద్వారా తిరిగిచ్చే ఉత్పత్తులు లేదా నిధులను తిరిగిచెల్లించే విధానాలు, ఇతర నిబంధనలు, షరతులను కూలం కషంగా అధ్యయనం చేయనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్స్ వేసేందుకు ఈ నెల 15వ తేది ఆఖరుకావడంతో ఆ లోగానే బిడ్స్ తెలంగాణ ప్రభుత్వం వేయనుంది.