అనన్య న్యూస్, కర్నూలు: ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బీచ్‌పల్లి దగ్గర నీరజా ప్రయాణిస్తున్న కారు టైరు పేలి పల్టీ కొట్టింది. దీంతో నీరజారెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హూటాహుటిన కర్నూలు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేసిన నీరజారెడ్డి భర్త పాటిల్ శేషిరెడ్డి ఫ్యాక్షన్ గొడవల వల్ల మృతి చెందారు. భర్త మరణంతో నీరజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని.. ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. 2019లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కృషి చేశారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం నీరజారెడ్డి ఆలూరు బీజేపీ ఇన్‌చార్జీగా ఉన్నారు. నీరజారెడ్డి మరణంతో ఆలూరు నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.