అనన్య న్యూస్, మహబూబ్ నగర్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోలీస్ కిష్టన్న త్యాగం మరువలేనిదని, రాత్రనక పగలనక ప్రజల సేవకై కష్టపడి పనిచేసే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తున్నారని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ సురక్ష దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి ఫ్లై ఓవర్ వద్ద భారీ వాహన ర్యాలీని బెలూన్లు ఎగురవేసి, జెండా ఊపి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అశేషంగా హాజరైన పోలీసులు, పట్టణ ప్రజలు బైకులు, కార్లు, ఇతర వాహనాల్లో ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు. ర్యాలీ అప్పన్నపల్లి, ఎనుగొండ, షాసాబ్ గుట్ట, న్యూ టౌన్, బస్టాండ్ సర్కిల్ మీదుగా తెలంగాణ చౌరస్తాకు చేరుకుంది. తెలంగాణ చౌరస్తాలో మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారని, బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు వస్తాయని పోలీస్ కిష్టన్న ఉద్యమంలో అమరుడయ్యాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత ఉప ఎన్నికల్లో కొందరి ఓటములతో స్తబ్దత వచ్చిన తరుణంలోనే 14 ఎఫ్ ద్వారా హైదరాబాద్ ను గుప్పిట పెట్టుకునాలని సమైక్యవాదుల కుట్రకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసు సోదరుల సహకారం మరువలేనిదని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే సిద్దిపేట సమావేశం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. ఉద్యమంలో ప్రతి సందర్భంలోనూ పోలీసులు తమకు సహకారం అందించి రాష్ట్ర సాధనకు చేసిన కృషి మర్చిపోలేనిదన్నారు. వాహన ర్యాలీ ఎస్పీ కార్యాలయం, క్లాక్ టవర్, బండ్లగేరి, రామ్ మందిర్ చౌరస్తా, గ్రంథాలయం, వన్ టౌన్, భగీరథ కాలనీ, బికే రెడ్డి కాలనీ మీదుగా శిల్పారామానికి చేరుకుంది.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ జీ. రవి నాయక్, ఎస్పీ నరసింహ, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ మహేష్, సీఐలు రాజేశ్వర్ గౌడ్, ప్రవీణ్, స్వామి తదితరులు ఉన్నారు.