అనన్య న్యూస్, మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ప్రచార అస్తంమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు మొత్తం ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అభివృద్ధి అనే ఆయుధం తోనే మేం సమాధానం చెబుతున్నామన్నారు. అభివృద్ధి చేసి చూపిస్తున్నాం కాబట్టే జాతీయ అవార్డులు మా సొంతమయ్యాయన్నారు. కేసీఅర్ పాలనను దేశమే గర్విస్తుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో హైద్రాబాద్ తప్పా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు వెనకబడ్డాయన్నారు. ప్రభుత్వంపై కాంగ్రెస్, బిజెపి వాళ్ళు విషప్రచారం చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు విషయ పరిజ్ఞానంతో బుద్ది చెప్పాలన్నారు. పదేళ్ల లో కాంగ్రెస్ పాలనలో ఇచ్చింది ఆరు వేల ఉద్యోగాలని, బీఆర్ఏస్ పాలనలో లక్షా 35 వేలు ఉద్యోగాలు కల్పించామన్నారు. నిరుద్యోగం తెలంగాణలో లేదనీ, కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందన్నారు. కాంగ్రెస్ పాలన బాగాలేదు కాబట్టే కేసీఅర్ ను రెండు సార్లు సీఎం కుర్చీలో కూర్చబెట్టారన్నారు. మళ్ళీ రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరన్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, వాస్తవాలు తెల్సుకోని మాట్లాడాలన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి బతుకుతున్నారని, ఆయన మాకు నీతులు చెప్పడం మాని, ఇక్కడ నేర్చుకొని వెళ్లాలన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కేసీఅర్ కు సరిలేరెవ్వెరన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 సీట్లు బీఆర్ఎస్ విజయం ఖాయమన్నరు. కాంగ్రెస్ పాలనలో ఫ్లోరైడ్, కరువు పాగా వేసింది తప్పా అభివృద్ధి ఊసే లేదన్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు కాటకాలను, ఫ్లోరైడ్ మహమ్మారిని పారద్రోలామన్నారు. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి లకే దక్కిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కాదు మంచు కొండ అని ఇప్పటికే నిరూపించామని, వచ్చే ఎన్నికలలోనూ మళ్లీ బిఆర్ఎస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ బిఅర్ఎస్ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.