అనన్య న్యూస్, మహబూబ్ నగర్: అనారోగ్యంతో దివంగతులైన మక్తల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం హాజరయ్యారు. ముందుగా దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించి ధైర్యం తెలిపారు. అనంతరం దయాకర్ రెడ్డి అంత్యక్రియల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కొత్తకోట దయాకర్ రెడ్డి పాడేను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అభిమానులతో కలిసి చంద్రబాబు నాయుడు మోశారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి తదితరులు దయాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. దయాకర్ రెడ్డి అంత్యక్రియల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పర్కాపూర్ గ్రామం జన సంద్రంగా మారింది.