జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, అనన్య న్యూస్: మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సారిక, కమిషనర్ మహమ్మద్ షేక్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతూ వారి సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదని అన్నారు. ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నమని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకి కానుకగా రూ. 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నిధులను మహిళ సంఘాలకు విడుదల చేయనున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం చైర్ పర్సన్ మున్సిపల్ మహిళా సిబ్బంది సిబ్బంది, మహిళ పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.