అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేట, జడ్చర్లలో మూడు రోజులుగా కొనసాగుతున్న బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు శుక్రవారం బొడ్రాయి నాభిశిల ప్రతిష్టతో సంపూర్ణమయ్యాయి. బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఇతర గ్రామాల నుంచి వచ్చిన బంధువులతో ఊరంతా సందడిగా మారింది. మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా తరలివచ్చి బొడ్రాయికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కావేరమ్మ పేట, జడ్చర్ల గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువతీ, యువకులు, మహిళలు ఉత్సాహంతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని మొక్కులు తీర్చుకున్నారు.