- దేశరాజధానిలో రెండు రోజుల బౌద్ధ సదస్సు
- సమస్యల పరిష్కారానికి బుద్ధుడి బోధనలే మార్గమన్న ప్రధాని
అనన్య న్యూస్, ఢిల్లీ: భారతదేశం ప్రపంచానికి బుద్ధుడిని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గౌతమ బుద్ధుని గొప్ప బోధనలు శతాబ్దాలుగా లెక్కలేనన్ని మంది ప్రజలను ప్రభావితం చేశాయని అన్నారు. ఢిల్లీలోని గ్లోబల్ బౌద్ధ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రపంచం నేడు యుద్ధం, అశాంతితో బాధపడుతోందన్న మోడీ.. అయితే శతాబ్దాల క్రితం బుద్ధుడు దీనికి పరిష్కారం చెప్పాడని అన్నారు.
బుద్ధుని మార్గమే భవిష్యత్తు, స్థిరత్వానికి మార్గమని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. బుద్ధ బోధనల నుండి ప్రేరణ పొందిన భారతదేశం ప్రపంచ సంక్షేమం కోసం కొత్త కార్యక్రమాలను తీసుకుంటోందని చెప్పారు. ప్రజలు, దేశాలు తమ ప్రయోజనాలతో పాటు ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మోడీ వెల్లడించారు. బుద్ధుడు చూపిన మార్గంలో నడిస్తే భవిష్యత్తు ఉంటుందని.. సుస్థిరత చేకూరుతుందన్నారు.
అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ) సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 20 , 21 తేదీల్లో గ్లోబల్ బౌద్ధ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ బౌద్ధ సన్యాసులు, పండితులు, ప్రతినిధులు హాజరయ్యారు.