- టోల్ ట్యాక్స్ పెరగడంతో చార్జీలు పెంచక తప్పదని వివరణ
- బస్ భవన్ నుంచి వాట్సాప్ ద్వారా ఉద్యోగులకు ఆదేశాలు
- ముందస్తు ప్రకటన లేకుండా చార్జీలు ఎలా పెంచుతారంటూ ప్రయాణికుల ఆందోళన
అనన్య న్యూస్, హైదరాబాద్: నిత్యావసరాల ధరలతోనే ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మరో పిడుగు వేసింది. శనివారం బస్సు చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టోల్ గేట్ ఫీజులు పెరగడంతో బస్ చార్జీలు పెంచక తప్పడంలేదని వివరణ ఇచ్చింది. అయితే, చార్జీల పెంపుపై ముందస్తుగా ఎలాంటి ప్రకటన లేకుండా, వాట్సాప్ ద్వారా సంస్థ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బస్ భవన్ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా బస్సుల్లో టికెట్ ధరలు పెరిగాయి. ఒక్కో టోల్‌తో రూ. 5 నుంచి రూ.10 వరకు టికెట్ చార్జీపై ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. శనివారం ఉదయం నుంచే పెంచిన ధరల ప్రకారం టికెట్ చార్జీలను కండక్టర్లు వసూలు చేస్తున్నారు. ఇదేంటని నిలదీసిన ప్రయాణికులకు బస్ భవన్ నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు వచ్చాయని కండక్టర్లు జవాబిస్తున్నారు.