- అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు
అనన్య న్యూస్, చేవెళ్ల: సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఎన్నో కలలు కంటున్నారని, ప్రధాని సీటు ఖాళీగా లేదని తెలుసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీనే ప్రధాని అవుతారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమీషా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంచనాలకు తగ్గట్టే చేవెళ్ల విజయసంకల్ప సభలో కేంద్రమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఆ రిజర్వేషన్లు ఎస్సి, ఎస్టి, బిసిలకు కేటాయిస్తామని అన్నారు. తెలంగాణలో బిజెపి సర్కార్ రావాలా వద్దా.. ఢిల్లీలోని ప్రధాని మోదీకి వినపడేలా ప్రజలు నినాదించాలని అమీత్ షా పిలుపునిచ్చారు.
9 ఏళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి పాలన సాగిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేస్తారా? ఆయన ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారు? అని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్లకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అవుతోందని, పేపర్ లీకేజీలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్పందించలేదని తప్పుబట్టారు. పేపర్ లీక్ ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలను మోదీ నుంచి దూరం చేయలేరని అమిత్షా తేల్చిచెప్పారు.
ప్రధాని సీటు ఖాళ్లీగా లేదు:
ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని ఎన్నో కలలు కంటున్నారు. కేసీఆర్.. ప్రధాని సీటు ఖాళీగా లేదని తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే ప్రధాని. కేసీఆర్ ముందు సీఎం సీటు కాపాడుకోవాలి. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది. ఎంఐఎం కు భయపడే విమోచన దినోత్సవాన్ని జరపట్లేదు. ఓవైసీ ఎజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారు. కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్లది. ఎంఐఎంకు బీజేపీ భయపడదు అని అమిత్షా స్పష్టం చేశారు.