- హన్వాడ మండల అభివృద్ధికి రూ.292 కోట్లు వెచ్చించాము.
అనన్య న్యూస్, మహబూబ్ నగర్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హన్వాడ మండలానికి త్వరలోనే సాగు నీటిని తీసుకువస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం హన్వాడ మండల ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 74 మంది లబ్ధిదారులకు రూ.7,408,584 చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కాలువలు, కుంటలు, చెరువులకు నీళ్లు మళ్లించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. మండలంలో సంక్షేమ పథకాలకే రూ.292 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెళ్లిళ్లు చేసుకున్న పేద ఆడబిడ్డలందరికీ పెళ్లి ఖర్చుల నిమిత్తం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1లక్ష నూట పదహారు రూపాయలను ఇస్తుందని వివరించారు. గత ప్రభుత్వాలు ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
ఆపదలో ఉన్నవారికి ఆసుపత్రులలో చికిత్స అందించి వారి వైద్యుల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం ఇవ్వడమే కాకుండా, ఎల్ఓసీలు అందజేస్తున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో రహదారుల అభివృద్ధి, బైపాస్ తో పాటు, హన్వాడ మండలానికి కూడా కొత్త బైపాస్ రహదారి రానుందని, ఫుడ్ పార్కు, ఐటీ పార్కు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. అనంతరం మంత్రి నాయినోనిపల్లిలో రూ.20 లక్షలు, ఇబ్రహీంబాద్ లో రూ.25 లక్షల వ్యయంతో వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను, తిరుమలగిరిలో రూ.15 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయ నిర్మల, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవో ధనంజయ గౌడ్, తాసిల్దార్ బక్క శ్రీనివాసులు పాల్గొన్నారు.