- సంక్షేమ పథకాలపై గ్రామాల్లో చర్చించాలి
- పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు
అనన్య న్యూస్, జడ్చర్ల: త్వరలోనే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జడ్చర్ల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, కర్వేన రిజర్వాయర్ 90 శాతం పూర్తయినదని, ఉదండాపూర్ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయపని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం జడ్చర్ల చంద్ర ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకులు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పని చేయాలని, ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు గందరగోళానికి గురిచేస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి చేర్చడంలో కార్యకర్తలు ముందుండాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చర్చించాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, మీరు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత పట్టిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.
మౌలిక వసతుల కల్పన, ఉపాధి, సంక్షేమం, విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లోనూ జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. ఈ తొమిదేళ్ల తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. గతంలో కరెంటు, నీళ్ళకు ఇబ్బందులు పడ్డ మనం, ఇవాళ కరెంటు నీళ్ల ఇబ్బందులు తొలిగాయన్నారు. ఎన్నో రంగాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇవాళ తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. అభివృద్ధిని ఓర్వలేని కొందరు దుర్మార్గులు కుట్రలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇంచార్జి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సారథ్యంలో మార్పులు జరుగుతాయని, పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, జిసిసి చైర్మన్ వాల్యా నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, ఏఎంసీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రఘుపతి రెడ్డి, కౌన్సిలర్లు, మూడా డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.