- జూన్ 29 గురువారం తొలి ఏకాదశి.
అనన్య న్యూస్: హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ”తొలి ఏకాదశిగా” గా పిలుస్తారు. దీనికే శయనఏకాదశి అని, హరి వాసరమని అని పేరు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. పురాణాలను అనుసరించచి ఈతిథి నాడు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు.
ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి, కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు.
ఏకాదశి తిథి: కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.
ఏకాదశి నాడు ఏం చేయాలి: ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.