- హైదరాబాద్ సభలో యూత్ డిక్లరేషన్ విడుదల
- అమరుల త్యాగమే తెలంగాణ యూత్ డిక్లరేషన్
- అమలు బాధ్యత నాదే ప్రియాంక గాంధీ
అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు అవుతున్న ఉద్యోగాలను భర్తీ చేయలేదని, ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘యువ సంఘర్షణ సభ’కు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐదు అంశాలతో రూపొందించిన ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏ ఒక్కరి కారణంగానో తెలంగాణ రాలేదని, తెలంగాణ ఇచ్చినా అమరుల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వచ్చిందా అని సభికులను అడిగారు. ‘రాలేదు’ అంటూ వారి నుంచి పెద్దఎత్తున సమాధానం వచ్చింది. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చారా!? నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే.. ఒక్కో నిరుద్యోగికి రూ.1.50 లక్షల దాకా చేతికి వచ్చేది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. భర్తీ ప్రక్రియ జరగడం లేదు. టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ, పేపర్లు లీకయ్యాయి. ఎంతో కష్టపడి చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. వారికేమైనా న్యాయం చేశారా!?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు ఉన్నాయని, తొమ్మిదేళ్లలో వాటిలో ఒక్క నియామకం కూడా జరగలేదని తప్పుబట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్క కొత్త యూనివర్సిటీని కూడా పెట్టలేదని, కానీ, ప్రజలను దోచుకోవడానికి ప్రైవేటీ వర్సిటీలకు అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు.
రాష్ట్రాన్ని తమ జాగీరు అనుకుంటున్నారని, తమను తాము జమీందారులమని అనుకుంటున్నారని పరోక్షంగా ప్రియాంక విరుచుకుపడ్డారు. ‘రాష్ట్రం కోసం వే లాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే.. మా తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తేలికయింది కాదు. కఠినమైన నిర్ణయం. ఆ సమయంలో అధికారం, పార్టీ, రాజకీయాల గురించి సోనియా గాంధీ ఆలోచించి ఉంటే.. రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకునేవారు కాదు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినే రాష్ట్రం ఇచ్చారు. వారి ఆకాంక్షలను గుర్తించి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయించారు. అని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రం తన లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని భావించామని, యువత ఆత్మ బలిదానాలకు గుర్తింపు వస్తుందని అనుకున్నామని, కానీ, అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఏ ఒక్కరి పోరాటం కారణంగానో తెలంగాణ రాష్ట్రం రాలేదు. తెలంగాణ పోరాటం ప్రజల హక్కుల కోసమే జరిగింది. అమరుల బలిదానాలతో, ప్రజలందరి పోరాట ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. రైతులు, యువకులు, మహిళలు, ఆదివాసీలు అందరూ పోరాటానికి నేతృత్వం వహించారు. రాష్ట్ర ఏర్పాటుతో మంచి జరుగుతుందని అంతా భావించారు. కానీ, విచారకరం.. ప్రజల కలలు కల్లలయ్యాయి. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం పూర్తి కాలేదు’’ అని విచారం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, అన్నీ అధికార పార్టీ నేతలకే చేరుతున్నాయని, అధికారంలో ఉన్నవారి బంధువులు, స్నేహితులకే ఉద్యోగాలు దక్కాయని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను బీఆర్‌ఎస్ నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు.
ఇందిరమ్మ అని అంటుంటే బాధ్యత పెరుగుతుంది:
తనను ఇందిరమ్మ అంటే బాధ్యత ఇంకా పెరుగుతుందన్నారు. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని, పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని..అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు. తెలంగాణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో ప్రుజలు జాగ్రత్తగా ఉండాలని, ఆ చైతన్యం తోనే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.