మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, అనన్య న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆయా ఇండ్ల నిర్మాణానికి మరోసారి గడువును పొడిగించింది. కటాప్ తేదీ నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్‌రావు గురువారం మీడియాకు వివరించారు. కేబినెట్‌లో పేదలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. జీవో 58, 59 కింద కొద్ది మంది మిగిలిపోయిన వారు మేం గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయాం, కటాఫ్ తేదీ నుంచి ఉపశమనం కల్పించాలని, పేదలకు అందరికీ ఇండ్లపై హక్కులు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ వారందరికీ చివరిసారిగా అవకాశం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. జీవో 58 కింద ఒక్క రూపాయి లేకుండా పేదలందరికీ ఇండ్లపై హక్కులు కల్పిస్తున్నాం, పేదలను గుండెలకు హత్తుకొని ఇవాళ వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. జీవో 58 కింద 1,45,668 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కొందరు పేదలు మిగిలిపోయారని, కటాఫ్ తేదీ నుంచి ఉపశమనం కల్పించాలని, అందరికీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చివరిసారిగా నెల రోజులపాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హులందరికీ హక్కులు కల్పించాలని కేబినెట్‌లో నిర్ణయించాం. అలాగే 59 జీవోకు సంబంధించి అవే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 59జీవో కింద 42వేలమంది లబ్ధిపొందారు. కటాఫ్ తేదీ గతంలో 2014లో తేదీ ఉండేది, దాన్ని 2020కి పెంచాం. ఆ లోపు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే వారందరికీ 58, 59 జీవో కింద వారికి హక్కులు కల్పించి, పేదల జీవితాల్లో ఉత్సాహం, ఆనందం నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అత్యంత పారదర్శకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పట్టాలను వారి ఇండ్లకు వెళ్లి ఉచితంగా ఇస్తున్నామని వివరించారు.