Sunday, March 16, 2025

తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే దారుణం: మంత్రి హరీష్ రావు..

  • ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు 14 బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.

అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరిత్యాల కంటే కూడా దారుణంగా తయారయ్యాయని, పంటలు చెడగొట్టుడు వానలు పడితే పంటలు దెబ్బతిన్నట్లు కాంగ్రెస్, బీజేపీ మాట్లాడే మాటలతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారి పోతోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. జడ్చర్లలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం మంత్రులు హరీశ్ రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట వడగండ్ల వాన పడితే నష్టపోయినట్లు, ఈరాష్ట్రంలో ప్రతిపక్షాల వల్ల కూడా తెలంగాణకు నష్టం జరుగుతోందని హరీశ్ రావు దుయ్యబట్టారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తుంది, అన్నంత గొప్పగా సీఎం కేసీఆర్ పాలన ఉంది. మన పథకాలను దేశం మొత్తం కాపీ కొడుతోంది. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. ఒక అబద్దాన్ని వెయ్యి సార్లు చెబితే నిజం అవుతుందనే గోబెల్స్ ప్రచారం లాగా రేవంత్ రెడ్డి బట్ట కాల్చి మీద వేస్తున్నాడని హరీశ్ రావు మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కాలేజీ అయినా వచ్చిందా. కానీ సీఎం కేసీఆర్ జిల్లాకొక మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారని, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆనాడు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 5 మెడికల్ కాలేజీలు నిర్మించుకున్నామని, లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన కొడంగల్‌కు 100 పడకల ఆసుపత్రికిన కేటాయించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క ఆసుపత్రిని కూడా తీసుకొని రాలేకపోయారు. కానీ అబద్దపు ప్రచారాలు మాత్రం చేస్తారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరుకు కరువు, వలసలు, ఆత్మహత్యలను ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక చేస్తున్న అభివృద్ధి పనులు చూసి వలస వెళ్లిన వారందరూ తిరిగి వస్తున్నారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా.. ఇంత అభివృద్ధి జరిగేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవులు వచ్చాయని అన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు అనుభవిస్తున్నారని, ఆనాడు ఉద్యమంలో కలిసి రాలేదు. అవతరణ ఉత్సవాలు జరుపుకోవద్దంటూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను, అమరులను అవమానపరుస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.

9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పాసయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టును కట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి 20 ఏళ్ల పట్టింది. కానీ, అంతకు పదింతలు పెద్దదైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వేగంగా నిర్మించు కుంటున్నామని, పాలమూరు ప్రాజెక్టు పనులు ముందుకు జరగకుండా కేసులు వేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనకడుకు వేయకుండా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తోందని, గత పాలకులు 60 ఏళ్లు పాలించినా జరగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో 8 ఏళ్లలోనే సాధ్యమయ్యిందని అన్నారు. పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలన తెస్తాం అంటున్నది అంటే, గతంలో ఉన్న 200 పెన్షన్ తెచ్చుకోవడమే. ఇప్పుడు ఉన్న దళిత బంధు, రైతు బంధును వదులుకోవడమే అని హరీశ్ రావు అన్నారు.

ప్రారంభోత్సవంలో టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిసిసి చైర్మన్ వాల్యా నాయక్, ఎస్పీ నరసింహ, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular