- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
అనన్య న్యూస్: తల్లిగా, సోదరిగా, భార్యగా అనుబంధాలను ఆత్మీయతలను పంచుతూ పరిపూర్ణమైన బాధ్యతను నెరవేర్చే శక్తి మహిళ. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ఆకాశంలో.. అవనిలో సగంగా మారుతున్నారు. అన్నింటా ఆమె ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుత సమాజంలో నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఏ పక్షి అయిన ఒక రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ.. జయహో జనయిత్రి, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామూర్తులకు శుభాకాంక్షలు.
మహిళ లేకుండా మనుగడ సాగించగలమా:
ఇంటా, బయటా ఎక్కడైనా మహిళ లేకుండా మనుగడ సాగించ గల మా? స్త్రీ లేకుండా ప్రపంచాన్ని ఊహించగలమా? సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోంది.
సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు.
కార్యేషు దాసీ కరణేషు మంత్రీ. భోజ్యేషు మాతా శయనేషు రంభా అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదు గుళికలనే మింగించింది. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకేయాలి. జయహో.. జనయిత్రీ.
మహిళా దినోత్సవ నేపథ్యం:
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చారిత్రక నేపథ్యం ఉంది. గడచిన 108 సంవత్సరాలుగా (1914నుండి) ఏటా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసుకున్న రోజు మార్చి 8. వివక్షకు వ్యతిరేంకగా, పౌర హక్కుల సాధన, ఓటు హక్కు కోసం మహిళల ప్రత్యేకంగా నిర్ణయించుకున్న రోజు. వివక్ష, పీడన నుంచి విముక్తి కల్పించాలంటూ మహిళలు నినదించిన రోజు. అయితే అంతకు ముందు కూడా మహిళా దినోత్సవం లేకపోలేదు. పలు దేశాల్లో వివిధ తేదీల్లో మహిళా దినోత్సవం జరుపుకునేవారు.
మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా కొన్ని దేశాల్లో సివిల్ అవేర్‌నెస్ డే జరుపుకుంటే, మరికొన్ని దేశాల్లో యాంటీసెక్సిజం డే, ఇంకొన్ని దేశాల్లో వివక్ష వ్యతిరేక దినోత్సవం, యాంటీ డిస్ర్కిమినేషన్‌డే.. ఇలా వివిధ రకాల పేర్లతో జరుపుకునే వారు. వేతనాల్లో అసమానతలకు వ్యతిరేకంగా 1908లో ఇంటర్నేషనల్ లేడీస్ గార్మెంట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అమెరికాలో సమ్మె జరిగింది. దీనిని మరచిపోకుండా 1909 ఫిబ్రవరి 28న న్యూయార్క్ లో అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. 1910 ఆగస్టులో డెన్మార్క్ రాజధాని కోహెన్ హేగన్‌లో అంతర్జాతీయ మహిళా మహాసభ నిర్వహించారు. ఆ మరుసటి ఏడాదే 1911 మార్చి 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు.
అప్పటికి కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు హక్కులేదు. పురుషులతో సమానంగా తమకూ ఓటుహక్కు కావలనీ మహిళలు నినదించారు. అయితే అమెరికన్లు మాత్రం చాలాకాలం పాటు ఫిబ్రవరి చివరి ఆదివారం జాతీయ మహిళా దినోత్సవంగా పాటించేవారు. 1913 చివరి శనివారం రష్యన్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేశారు. 1914కు పూర్వం మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఏటా మార్చి 8వ తేదీనే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేస్తున్నారు.
వివక్షకు వ్యతిరేకంగా 1914 మార్చి 8న లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించాక ఎక్కువ దేశాల్లో ఆదే రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించడం ప్రారంభించారు. 1977లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధిసభ మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించే వరకు వివిధ దేశాల్లో పలు తేదీల్లో దీనిని జరుపుకునేవారు. ఐక్యరాజ్య సమితి ప్రకటన తర్వాత నుంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది..