అనన్య న్యూస్, జడ్చర్ల: గ్రేడ్ వన్ మున్సిపాలిటీ గా జడ్చర్ల మున్సిపాలిటీ త్వరలో అప్ గ్రేడ్ కానుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేట జిపి కమ్యూనిటీ హాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
2014 సంవత్సరం తర్వాత జడ్చర్ల పట్టణం చాలా అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ఒక్క పార్కు కూడా లేదని ప్రస్తుతం 17 పార్కులను అందుబాటులోకి తెచ్చామన్నారు. నల్లకుంట, నల్లచెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చమని, ప్రతి వార్డులో సిసి రోడ్లు, డ్రైనేజీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామన్నారు. గతంలో నీళ్లకు కూడా ఆడబిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారని, మంచినీళ్ల కోసం టాంకర్ల వద్ద బారులు తీరేవారని, నేడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అందజేసి తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు.
పట్టణమంతా డబల్ లైన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ ల అభివృద్ధితో సుందరంగా మారిందన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీకి త్వరలోనే మరో రూ. 30 కోట్ల నిధులు మంజూరు కానున్నాయన్నారు. జడ్చర్ల గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ కానుందని, పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రూపాయలు కోటి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జిసిసి ఛైర్మన్ వాల్యా నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు బుక్క మహేష్, జ్యోతి రెడ్డి, రమేష్, చైతన్య చౌహన్, సతీష్, శశికిరణ్, ఉమా శంకర్ గౌడ్, లత, ఉమాదేవి, చైతన్య గౌడ్, కోనేటి పుష్పలత, నాయకులు పిట్టల మురళి తదితరులు పాల్గొన్నారు.