అనన్య న్యూస్, మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టులు అనుకున్న పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 69 వ రోజు బుధవారం జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గం ఉదండాపూర్ లో కొనసాగింది. ఈ సందర్భంగా ఉదండాపూర్ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన భూసేకరణ విషయంలో ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని మరిచిందని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసే గ్రామాల్లో కుటుంబ వ్యవస్థ దెబ్బ తినకుండా సామాజిక బాధ్యతతో ప్రభుత్వాలు వ్యవహరించాలి, కానీ ఉదండాపూర్ లో ఇందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులు కోరుతున్న డిమాండ్లు చట్టబద్ధమైనవని, పరిహారం వద్దని భూములకు భూములు ఇప్పించాలని అన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ ఉదండాపూర్ వల్లూరు భూ నిర్వాసితులకు జడ్చర్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద జడ్చర్ల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పక్కన ఇంటి స్థలాలను కేటాయించాలని అన్నారు. 90 శాతం పనులు పూర్తయిన కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టిపిసి ఉపాధ్యక్షులు ఓబేద్దుల కొత్వాల్, పిసిసి జనరల్ సెక్రెటరీ సంజీవ్ ముదిరాజ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి తదితరులు ఉన్నారు.