హైదరాబాద్, అనన్య న్యూస్: సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు గుడ్ న్యూస్ ను తెలిపారు. 50 గజాల స్థలం ఉన్న గృహలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరుగుతుందని, ఆ పథకాలు గ్రౌండింగ్ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. నిజమైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందాలి. గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను త్వరలోనే పంపిస్తాం. 50 గజాల స్థలం ఉన్నా పథకం వర్తిస్తుంది. డబుల్‌బెడ్రూం కట్టాల్సి ఉంటుంది. బేస్‌మెంట్ లెవల్‌లో రూ.లక్ష, స్లాబ్ స్థాయిలో లక్ష, పూర్తయిన తర్వాత లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి అతిత్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తాం అని సీఎం కేసీఆర్ వివరించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తామని, వారితో సమన్వయం చేసుకొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూసుకోవాలని చెప్పారు. ఇంటి స్థలంమహిళ పేరుతో ఉండాలని.. లేనిపక్షంలో మహిళ పేరుపై ఇంటి స్థలం మార్పిడికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చును ప్రభుత్వమే భరించే అంశాన్నీ పరిశీలిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటికే కట్టిన డబుల్‌బెడ్రూం ఇండ్లను కూడా లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక దళిత బంధు ఎంపిక ప్రక్రియలో దళారీలు లేకుండా చూడాలని, దళితుల అభ్యున్నతికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ పథకంలో అవకతవకలకు ఆస్కారం ఉండవద్దన్నారు. ప్రభుత్వం జీవో 58, 59కి సవరింపులు, మినహాయింపులు ఇచ్చిందని, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సమయంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటారన్న విమర్శలుంటాయి. అయితే, పేదవాడు బీఆర్‌ఎస్ కార్యకర్త అయినపుడు అతనికి పథకం ఇవ్వకుండా ఆపలేం. అదే విషయాన్ని వివరించి చెప్పాలి అని కేసీఆర్ అన్నారు. గొర్రెల పంపిణీకి సంబంధించి కూడా నిధులు రెడీగా ఉన్నాయని, వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేలా చూడాలని ఆయన సూచించారు. పోడు భూములకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని గిరిజనులకు వివరించి చెప్పాలని పోడుప్రాంత ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఆదేశించారు. ఇచ్చిన హామీ మేరకు నాలుగు లక్షలకు యాజమాన్యపత్రాలు ఇవ్వబోతున్నామని సీఎం వెల్లడించారు.
కంటివెలుగు కార్యక్రమానికి ప్రతి ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమయం కేటాయించాలని సూచించారు. శిబిరాల వద్దకు వెళ్లి, ప్రజలను చైతన్యం చేయాలని శిబిరాలు ఎలా జరుగుతున్నాయో చూడాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గద్వాల, నిర్మల్, నాగర్‌కర్నూల్ జిల్లాలో నూతన కలెక్టరేట్లను త్వరలో ప్రారంభించుకోబోతున్నామని వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభానికి తాను కానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వస్తారని తెలిపారు.